ఈ నెల 27 నుండి సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం
ఢిల్లీ (CLiC2NEWS): ఇకపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరగనున్న కీలక విచారణలను దేశ ప్రజలంతా వీక్షించే అవకాశం లభించనుంది. సెప్టెంబర్ 27వ తేదీ నుండి సుప్రీంకోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని మంగళవారం సిజెఐ జస్టిస్ లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈనెల 27 నుండి రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్ చేయనున్నారు.
జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ సందర్భంగా ఆగస్టు 26వ తేదీన ప్రత్యేకంగా సమావేశమైన సెరిమోనియల్ ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా వెబ్ కాస్టింగ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు 2018లోనే లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. కానీ ఆచరణలోకి రాలేదు.