ఎంబిబిఎస్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త
ఎంబిబిఎస్- బి కేటగిరి సీట్లలో 85% తెలంగాణ వాసులకే
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటి, నాన్ మైనారిటి మెడికల్ కళాశాలల్లో ఎంబిబిఎస్, బిడిఎస్ – బి కేటగిరి సీట్లలో 85% సీట్లు తెలంగాణకు చెందిన విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలను సవరించింది. ఈ మేరకు గురువారం జీఓ 129,130లను సర్కార్ విడుదల చేసింది. ఈ సవరణతో రాష్ట్రంలో ఉన్నటువంటి 24 ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ని 1,068 ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ వాసులకే దక్కనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 20 నాన్ మైనారిటి కాళాశాలలు, 4 మైనారిటి కళాశాలలు ఉన్నాయి. వాటిలో 3,750 మెడికల్ సీట్లు ఉన్నాయి. వీటిలో నాన్‌మైనార్టీ కాలేజీల్లో ఉన్నటువంటి మొత్తం సీట్లు 3,200. ఇందులో బి కేటగిర కింద 35% అంటే.. 1120 సీట్లు ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ఇచ్చేవారు. తాజా ఉత్తర్వులుతో ఈ 35% సీట్లలో 85% సీట్లు అంటే.. 952 సీట్లు తెలంగాణ విద్యార్థులకు చెందేలా సవరణ చేశారు. మిగతా 15% (168) సీట్లు మాత్రమే ఓపెన్ కోటలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు అర్హులు. వీటిలో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం దక్కుతుంది.