ఇక్కడ విమర్శిస్తున్నారు.. ఢిల్లీలో అవార్డులిస్తున్నారుః సిఎం కెసిఆర్
వరంగల్ (CLiC2NEWS): కేంద్ర మంత్రులు రాజకీయాల్లో భాగంగానే విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి కెసిఆర్‌ను తిట్టి వెళ్తున్నారు. అలా తిట్టిన వారే ఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తున్నారని సిఎం అన్నారు. రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు విమర్శిస్తున్నారని సిఎం అన్నారు.
వరంగల్‌లోని ప్రతిమ కేన్సర్ హాస్పిటల్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఏదైతే ప్రజలకు చెప్పిన్నో.. ఆ మాటలు ఇవాళ వంద శాతం సాకారం అవుతోంది. తెలంగాణ గొప్ప ధనిక రాష్ట్రంగా ఉంటామని ఉద్యమ సమయంలో చెప్పాను. నేను ఉద్యమం ప్రారంభించినప్పుడు పుట్టిన పిల్లలకు ఇప్పుడు ఫలితాలు అందుతున్నాయి. ఇంతకు ముందు తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఐదు మాత్రమే ఉండేవి.. ఇప్పుడు వాటి సంఖ్య 17కు చేరింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం.
ప్రపంచంలో ఏ దేశానికి లేని అనుకూలతలు భారత దేశానికి ఉన్నాయి. దేశంలో అద్భుతమైన వ్యవసాయం ఉంది. దేశం మొత్తంగా 70 వేల టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. అత్యధిక పంటలు పండిస్తున్నా.. విదేశీ ఆహార పదార్థాలపై ఆధార పడుతున్నాం. అద్భుత యువశక్తి ఉన్నా.. వెనకబడి ఉన్నాం. విద్వేశ రాజకీయాలను యువత గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. మన రాష్ట్రం పురోగమనం అనుకన్న విధంగా సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలి“ అని సిఎం అన్నారు.