బీజేపీలో చేరిన కుష్బూ
న్యూఢిల్లీ: తమిళ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోమవారం మధ్యాహ్నం బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో జరిగిన చేరిక కార్యక్రమంలో కుష్బూకు పార్టీ అభ్యర్థిత్వాన్ని సంబిత్ పాత్రా అందించారు. గత ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి ఖష్బూను తప్పించడంతో ఆమె ఆ పార్టీకి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు.. గ్రౌండ్ రియాల్టీ తెలియకుండానే ఆదేశాలు ఇస్తున్నారని, ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఖుష్బూ ఇవాళ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
తప్పక చదవండి: రేపు బీజేపీలోకి ఖుష్బూ!
2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తమిళనాడులో బీజేపీ ముఖచిత్రాన్ని ఖుష్బూ మార్చేస్తుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కీలక బాధ్యతలు సైతం అప్పగించే అవకాశం ఉంది. గతంలో ఆమె డీఎంకేలో కూడా చేరారు. 2010లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఖుష్బూ ఆ పార్టీకి పనిచేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ పార్టీని వీడిన ఖుష్బూ.. సోనియా గాంధీతో భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. కాగా తాజాగా బీజేపీలో చేరడంతో పదేళ్ల కాలంలోనే మూడు పార్టీలను మారినట్లు అయ్యింది.