ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితులకు రిమాండ్!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టిఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందుల రిమాండ్‌కు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నిందితులు వెంటనే సైబారాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ నిందితులు లొంగిపోకపోతే వారిని అరెస్టు చేసి ఎసిబి కోర్టులో హాజరు పరచాలని పేర్కొంది. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించాలని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసులో రెండు రోజుల పాటు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని, నిందితులు తమ నివాస అడ్రసులను సైబారాబాద్ పోలీసు కమిషనర్‌కు అందజేయాలని సూచించింది. అలాగే ఫిర్యాదు దారుడిని సంప్రదించడం కానీ, సాక్షులను ప్రభావితం చేయడానికి గానీ వారు యత్నించకూడదని కోర్టు షరతులు విధించింది.
మరో వైపు భారతీయ జనతా పార్టీ పిటిషన్‌పై విచారణ.. దర్యాప్తు పై స్టే..
అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైనే కేసు దర్యాప్తును సిట్ లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వచ్చే నెల 4వ తేదీ వరకు దర్యాప్తుపై స్టే విధించిన న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది. ఆ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సహా ప్రతివాదులుగా ఉన్న 8 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
కాగా ఈ కేసులో రెండు ధర్మాసనాలు వేర్వేరు తీర్పులు ఇచ్చాయి. దీంతో కేసులో ఏం జరుగనుందో వేచి చూడాలి.