బాలికపై అత్యాచారం.. దొంగబాబాకు దేహశుద్ధి

నిజామాబాద్ : భూతవైద్యం పేరుతో బాలికపై అత్యాచారం… చేసిన దొంగబాబను చితకబాదారు మహిళలు. చెప్పులు చీపుర్లు పట్టుకొని చితక్కొట్టుడు కొట్టారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న దొంగ బాబాకు బడితపూజ చేశారు. అభంశుభం తెలియని బాలికను బెదిరించి లైంగిక వాంఛను తీర్చుకుంటున్న ఘటన నిజామాబాద్ నగరంలోని పూసలగల్లీలో మంగళవారం వెలుగుచూసింది. అంతే కాకుండా తల్లిదండ్రులకు చెబితే చంపుతానని బాలికను బెదిరించాడు. దొంగబాబా బెదిరింపులకు హడలిపోయిన బాలిక.. ఈ దారుణం బయటికి కక్కలేదు. బాలికకు ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అది మామూలు కడుపు నొప్పి కాదని తెలియడంతో దొంగబాబా అసలు రంగు బయటపడింది.
దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు దొంగబాబాను చితకబాదారు. అయితే భూతవైద్యం పేరుతో మరికొంతమంది మహిళలపై కూడా గతకొంతకాలంగా లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు.