పది రోజుల్లో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి: సిఎం కెసిఆర్

జగిత్యాల (CLiC2NEWS): రాబోయే పది రోజుల్లో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్, పట్టణంలోని మోతెలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. బిడి కార్మికులను ఏ రాష్ట్రం పట్టించుకున్నదని.. మన ప్రభుత్వమే బిడి కార్మికులకు ఫించను ఇస్తుందన్నారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు ఎమ్మెల్యే నిధులు మరో రూ. 10 కోట్లు పెంచుతున్నామని ఈ సందర్బంగా కెసిఆర్ తెలిపారు.
కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నానని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ ఆలయానికి ఇప్పటికే 384 ఎకరాలు ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు. యాదాద్రి క్షేత్రం లా కొండగట్టును కూడా అభివృద్ధి చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ భహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. జగిత్యాల జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టే ఇది సాధ్యమైందని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధానాల వల్ల తెలంగాణ రూ. 3 లక్షల కోట్లు నష్టపోయిందని ఆయన ధ్వజమెత్తారు. మన చుట్టూ గోల్‌మాల్ గోవిందం గాళ్లు ఉన్నారని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. లేకపోతే నష్టపోతామని, చిన్నపొరపాటు వలన 60 ఏళ్లు నష్టపోయయిన చరిత్ర మనదన్నారు.