16 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది. ఈ మేరకు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి టిటిడి పరిపాలనా భవనంలోని కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ గుప్తా, టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, డిఐజి కాంతిరాణా టాటా, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి తదితరులతో సమీక్ష నిర్వహించారు.
కల్యాణ మండపంలో వాహనసేవలు
శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణ మండపంలో వాహనసేవలు జరుగుతాయి. ఉదయం 9 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన అక్టోబరు 16న ఉదయం 9 నుండి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగుతాయి. అక్టోబరు 20న రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గరుడసేవ జరుగుతుంది. అక్టోబరు 21న మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు వసంతోత్సవ ఆస్థానం, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు కల్యాణ మండపంలో పుష్పక విమానంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు. అక్టోబరు 23న ఉదయం 8 గంటలకు స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవ ఉంటుంది. అక్టోబరు 24న ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఆలయంలోని అద్దాల మండపంలో స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు.
ఈ నెల 25న ఏకాంతంగా విజయదశమి పార్వేట ఉత్సవం
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటి రోజు అక్టోబరు 25న విజయదశమి పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరుగనుంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేస్తారు. అక్కడ పార్వేట ఉత్సవం అనంతరం స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు.
కాగా, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహనసేవలను ఆలయ మాడ వీధుల్లో నిర్వహించాలని అక్టోబరు 1న టిటిడి ప్రకటించింది. అయితే, అక్టోబరు 6న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన నిబంధనలు విడుదల చేసింది. ఈ మేరకు 200 మందికి మించకుండా మాత్రమే మతపరమైన, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని సూచనల్లో పేర్కొంది. అదేవిధంగా, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు శీతాకాలంలో ప్రముఖ ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో భక్తులు గుమికూడే అవకాశం ఎక్కువగా ఉన్నందున, కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. కావున భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడరాదని టిటిడి కోరింది.