సికింద్రాబాద్-విశాఖపట్నం: సంక్రాంతి రోజున వందే భారత్ రైలు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు సంక్రాంతి రోజు ప్రారంభంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే, ప్రారంభం రోజు రైలును ప్రత్యేక సమయాల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి అదే రోజు రాత్రి 8.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖజీపెట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. ఇది కేవలం 15వ రోజు మాత్రమే ఈ స్టేషన్లలో ఆగుతుంది.
16వ తేదీ నుండి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. విశాఖ నుండి ఈ రైలు (20833) ఉదయం 5.45 కి బయలుదేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు ఈ రైలు (20834) బయలుదేరి.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.