వ‌ర‌ద మృతుల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం

కూలిన ఇళ్ల‌కు కొత్త ఇళ్లు మంజూరుః సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ : భారీ వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు త‌క్ష‌ణ‌మే సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. భారీ వ‌ర్షాల వ‌ల్ల ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావాల్సిన నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను వెంట‌నే అందించాల‌ని ఆదేశించారు. స‌హాయ పున‌రావాస కార్య‌క్ర‌మాల‌పై సిఎం గురువారం హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో స‌మీక్ష చేశారు. జీహెచ్ఎంసిలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

జీహెచ్ఎంసీకి త‌క్ష‌ణం రూ. 5 కోట్లు విడుద‌ల‌

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి రూ. 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామ‌న్నారు. లోతట్టు ప్రాంతాలు, అపార్ట్‌మెంట్ సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాల‌న్నారు. ఆ త‌ర్వాత మాత్ర‌మే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందిస్తామ‌న్నారు.
ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో.. వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతిరోజు లక్షా 10 వేల మందికి భోజన వసతి కల్పిస్తున్నాం. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించాం. ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు, ప్రతి ఇంటికి 3 రగ్గులు అందించాలి.

ఈ స‌మావేశంలో మంత్రులు కేసీఆర్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్.పీ.డీ.సీ.ఎల్. సీఎండి రఘుమారెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ద‌న్ రెడ్డి, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎంఏయుడీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జల వనరులశాఖ ఈఎన్‌సీ మురళీధర్ రావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.