మళ్లీ మసకబారుతోన్న తాజ్‌మహల్
ఆగ్రా : ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి.. ప్రేమకు చిహ్నం తాజ్‌మహల్. ప్రపంచంలోని ప్రతి ప్రేమికులు ఒక్కసారైనా సందర్శించాలి అనుకునే సుందర కట్టడం..నిరంతరం పర్యాటకులతో సందడిగా ఉండే తాజ్ అందం కాలుష్యం కారణంగా మసకబారుతోంది. ఈ కట్టడను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను ఖర్చుచేస్తున్నాయి. నిరంతరం పర్యాటకులతో కిక్కిరిసి ఉండే ఈ తాజ్‌మహల్.. లాక్డౌన్ కొనసాగుతోన్న సమయంలో బోసిపోయింది. రవాణా నిలిచిపోయి, కర్మాగారాలు మూతపడటంతో కాలుష్యం గణనీయంగా తగ్గింది. దీంతో తాజ్‌మహల్ అందం రెట్టింపయింది. తిరిగి దేశంలో అన్‌లాక్ మొదలైన తర్వాత మళ్లీ రవాణా మొదలైంది. ఫ్యాక్టరీలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. మరోవైపు నిర్మాణ రంగం కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. దీంతో ఇప్పుడు తాజ్‌మహల్‌కు మళ్లీ ముప్పు ముంచుకొచ్చింది. ఈ సుందర కట్టడం సమీపంలోనే పెద్ద ఎత్తున నిర్మాణాలను చేపడుతుండటంతో తాజ్‌మహల్ పై విపరీతమైన ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజ్ చుట్టూ ప్రమాదకర వాయువులు వ్యాపించడంతో తాజ్‌మహల్ శోభ మసకబారుతోంది. ఈ కాలుష్యం దెబ్బ కేవలం తాజ్‌మహల్ కే కాదు.. ఆగ్రా నివాసులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆగ్రాలో దుమ్ము, ధూళి పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు పలు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధికార యంత్రాంగం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంపై అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గాలిలో పెరుగుతున్న ఈ కాలుష్యం, దుమ్ము, ధూళి తాజ్‌మహల్‌ను దెబ్బతీస్తోందని, తాము కూడా అనారోగ్యం పాలవుతున్నామని, ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. తాజ్ శోభ ఏ మాత్రం తగ్గకుండా తగు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, తాజ్ ప్రేమికులు కోరుకుంటున్నారు.