చిన్నారులను సంపులో పడేసి.. తల్లి బలవన్మరణం

అల్వాల్ (CLiC2NEWS): తొమ్మిది రోజుల వయసున్న కవలలను సంపులో పడేసి.. తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానాజిగూడలో నివాసం ఉంటున్న సంధ్యారాణి, నర్సింగరావుకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. తనకు పుట్టిన బిడ్డలు ఏదో ఒక అనారోగ్యంతో చనిపోతున్నారని.. సంధ్యారాణి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మొదటి సారి కవలల జన్మించగా.. వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. రెండో సారి గర్భందాల్చినపుడు కడుపులో శిశువు మృతి చెంది గర్భస్రావమైంది. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైందని బంధువులు తెలిపారు. మూడవ సారి ఆమెకు కవలలు మగ, ఆడ శిశువు జన్మించారు. వారిలో ఒకరిని బరువు తక్కువగా ఉన్న కారణంగా కొన్నిరోజులు ఐసియులో ఉంచారు. అనంతరం తల్లీ బిడ్డలు ఇంటికి చేరుకున్నారు. అయినా ఆమెకు పాత జ్ఞాపకాలు వెంటాడాయి. గతంలో మాదిరిగానే ఇపుడు కూడా బిడ్డలు చనిపోతారనే ఆందోళనతో చిన్నారులను సంపులో పడేసి.. తానూ అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.