ఈడీ సోదాల్లో భారీగా బయటపడ్డ ఆభరణాలు, నగదు
ముంబయి (CLiC2NEWS): మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్రలో నిర్వహించిన సోదాల్లో ఈడీ అధికారులు భారీగా ఆభరణాలు, నగదును జప్తు చేశారు. ముంబయి, నాగ్‌పూర్‌లో పంకజ్ మెహాదియా, లోకేశ్ కార్తిక్ జైన్‌కు సంబంధించిన 15 వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ. 5.51 కోట్లు విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, రూ. 1.21 కోట్ల నగదును గుర్తించారు. ఏకకాలంలో ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో ఒకేసారి దాడులు చేశారు. ఆభరణాలు, నగదుతో పాటు డిజిటల్ యంత్రాలు, పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పంకజ్మెహాదియా పెట్టుబడుదారులను అధికశాతం వడ్డీ ఇస్తానని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు సమాచారం. పెట్టుబడులను ఆకర్షించడానికి బ్యాంకుల్లో రూ. 150 కోట్ల వరకు లావాదేవాలు జరిపారు. పెట్టుబడిదారులను మోసగించి కోట్ల రూపాయలు కాజేసిన కేసులో పంకజ్ మెహదియా, లోకేష్ జైన్, కార్తీక్ జైన్, బల్ముకుంద్ లాల్ చంద్, ప్రేమలత మెహాదియాపై కేసు నమోదైంది. దీని ఆధారంగా వారి నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు జరిపినట్లు పేర్కొన్నారు.