జలమండలికి వరల్డ్ వాటర్ అవార్డు
హైదరాబాద్ (CLiC2NEWS):జలమండలిని మరో అవార్డు వరించింది. వాటర్ డైజెస్ట్ అనే ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 2022-2023 సంవత్సరానికి 65 కేటగిరీల్లో నిర్వహించిన వరల్డ్ వాటర్ అవార్డ్స్ లో జలమండలికి గవర్నమెంట్ కేటగిరీలో ఉత్తమ ఎస్టీపీ అవార్డు లభించింది.
జలమండలి నగరంలోని జలమండలి ప్రధాన కార్యలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు అవార్డును ఎండీ దానకిశోర్ కు శనివారం అందజేశారు. ఈ అవార్డు రావడంపై ఎండీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. నగరంలో అందరికీ తాగు నీరు అందించడంతో పాటు.. ఉత్పన్నమయ్యే మురుగును శుద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ ల ప్రోత్సాహం ఎంతో ఉందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి ప్రశంస
శుక్రవారం రోజు దిల్లీ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబుకు అవార్డును బహూకరించడంతో పాటు ప్రశంసా ప్రతాన్నిఅందించారు. అవార్డుల ప్రదానోత్సవరంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. దేశంలోనే వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్ పయనిస్తోందని కొనియాడారు. నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరిడిపై ఉందని, నీటిని వృథా చేస్తే సకల ప్రాణులకు నష్టం కలిగించిన వారమవుతామన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఇజ్రయెల్ ఇండియా రాయబారి నోర్ గిలోన్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ దేశంలో 95 శాతం మంది ప్రజలు నీటిని పొదుపుగా వాడతారన్నారు. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పొదుపు సూత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
యునెస్కో, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో.. వాటర్ డైజెస్ట్ మ్యాగజైన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో నీటి నిర్వహణకు సంబంధించిన పలు ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్ సంస్థలు పాల్గొన్నాయి. ప్రభుత్వ విభాగంలో హైదరాబాద్ వాటర్ బోర్డుకు ఈ అవార్డు లభించింది.
దేశంలోనే వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేసే నగరంగా
భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా వంద శాతం మురుగు నీటి శుద్ధికోసం రూ.3866 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో 62 ఎస్టీపీలను సివరేజ్ మాస్టర్ ప్లాన్ కింద తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 1650 మిలియన్ లీటర్ల మురుగు నీరు రోజూ ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 772 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని 25 ఎస్టీపీల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా మూసీ లోకి వదులుతున్నారు. ఇంకా 878 ఎంఎల్‌డీల మురుగు జలాలు శుద్ధి చేయాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వం మొదటి దశలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాన్ని 2022 లో చేపట్టింది. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొద్ది నెలల్లో పనులు పూర్తవుతాయి. తద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో ఉత్పన్నమయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయవచ్చు. ఫలితంగా దేశంలోనే హైదరాబాద్ వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేసిన నగరంగా ఖ్యాతికెక్కనుంది.
ప్రసిద్ది చెందిన అంబర్ పేట్ ఎస్టీపీ
మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో ఆసియాలోనే అతి పెద్ద ప్లాంట్ గా అంబర్ పేట్ ఎస్టీపి ప్రసిద్ధి చెందింది. కూకట్ పల్లి నాలా నుంచి ప్రారంభమయే మురుగు నీరు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఎన్నో నాలలను కలుపుకుంటూ అంబర్ పేట్ వద్దకు చేరుకుంటుంది. ఇక్కడ నిర్మించిన ప్లాంట్ ద్వారా నిత్యం 339 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు.
శుద్ది చేసిన నీటి వినియోగం
సర్క్యులర్ ఎకానమీ అనే పద్ధతి ద్వారా ఇక్కడ శుద్ధి చేసిన మురుగు నీటిని మొక్కల పెంపకానికి, ప్రభుత్వ రంగంలో నిర్మాణాలకు వాడుతుంటారు. పలు సాఫ్ట్ వేర్ కంపనీలు తమ కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కల పెంపకానికి, మిగతా అవసరాలకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. నీటిలో మిగిలిపోయిన గట్టి పదార్థాలను బయోగ్యాస్ ఉత్పత్తికి వాడుతున్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి పీఆర్ బృందం, సీజీఎంలు ప్రసన్న కుమార్, వినోద్ భార్గవ, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పాల్గొన్నారు.