సంజయ్ అరెస్టు.. భారీగా తరలివచ్చిన బిజెపి శ్రేణులు!

కరీంనగర్ (CLiC2NEWS): భారతీయ జనతాపార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్థరాత్రి అరెస్టు చేశారు. ఆయనను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అర్థరాత్రి సమయంలో కరీంనగర్ ఎసిపి తుల శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలు సంజయ్ అత్తమ్మవాళ్లింటికి చేరుకున్నారు. సంజయ్ అత్తమ్మ ఇటీవల చనిపోగా.. 9 రోజుల కార్యక్రమంల బుధవారం (ఇవాళ) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జ్యోతినగర్‌లో ఉన్న వారి ఇంటికి సంజయ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అడ్డు వచ్చిన వారిని తోసేస్తూ బండి సంజయ్‌ను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు.
బిజెపి కార్యకర్తల ఆందోళనలు
సంజయ్‌ను అరెస్టు చేయడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం చెప్పకుండా అరెస్టు చేశారంటూ కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు. కాగా సంజయ్‌ను భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీసు స్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పలువురు బిజెపి శ్రేణులు అక్కడికి చేరుకున్నారు.
పోలీసులు ఎమ్మెల్యే రఘునందన్ రావును అడ్డుకున్నారు. సంజయ్‌ను పరామర్శిందేకు వస్తే అడ్డుకోవడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం రఘునందన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనను అడ్డుకున్నారని అన్నారు. బండి సంజయ్‌ను ఏ కేసులో ఎందుకు అరెస్టు చేశారో పోలీసులు చెప్పడం లేదని రఘునందన్ మండి పడ్డారు.