ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూలైన్లు..
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/ttd-devotees-traffic.jpg)
తిరుమల (CLiC2NEWS): తిరుమలకు భక్తజనం పోటెత్తారు. స్వామివారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. ఈ వారం అంతా దాదాపు సెలవు దినాలు ఉండటంతో దేశ నలుమూలల నుండి తిరుమలకు వచ్చే భక్తులతో రద్దీ ఎక్కువైంది. భక్తుల క్యూలైన్లు అన్ని కంపార్టమెంట్లు నిండిపోగా.. ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు కొనసాగుతున్నాయి. దీంతో టిటిడి కీలక ప్రకటన చేసింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ ఎస్డి టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన వారు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. టైమ్ స్లాట్ టోకెన్లే లేని భక్తులు రావద్దని సూచించారు. జెఇఒ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలు, క్యూలైన్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారలు తెలిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాల్లో తాగునీటి వసతులు ఏర్పాట్లు చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించారు. పిల్లలకు ఎప్పటికప్పుడు పాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.