నేడు భాగ్యనరంలో మళ్లీ కుండపోత!
హైదరాబాద్ : దక్షిణ ఎపి తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. 1.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. ఈ మధ్య భారీ వరదల ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. మొన్నటి వర్షానికే ఇప్పటికీ పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు కాలనీల్లో సహాయక చర్యలు కొనసాగిస్తూనే బాధితులకు పునరావాసం కల్పిస్తున్నారు అధికారులు.
తెలుగు రాష్ట్రాలకు నేడు, రేపు భారీ వర్ష సూచన..
అమరావతి : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ కేంద్ర అధికారిణి డైరెక్టర్ స్టెల్లా మాట్లాడుతూ.. దక్షిణ ఎపి తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. 1.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో.. 2.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో సోమవారం కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ర్టాల అధికారులు అప్రమత్తమయ్యారు.