రాజానగరం: సినీఫక్కీలో రూ. 50 లక్షల నగదు చోరీ!
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/RS.-500-NOTES.jpg)
తూర్పుగోదావరి (CLiC2NEWS): దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు.. అత్యాశకు పోయి ఓ వ్యాపారి రూ. 50లక్షల నగదును పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన మాజేటి లక్ష్మీనారాయణ కిరాణా వ్యాపారి. అతను ఓ వ్యక్తి రూ. 50 లక్షలు విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. బదులుగా రూ. 60 లక్షల విలువైన రూ. 2000 నోట్లు ఇస్తున్నాడని తన స్నేహితుడు ద్వారా తెలుసుకున్నాడు. వ్యాపారి రూ. 2000 నోట్లను ఎలాగైనా సెప్టెంబర్‌లోపు మార్చుకోవచ్చనుకుని.. లక్ష్మీనారాయణ రూ. 50 లక్షల విలువైన రూ.500 నోట్లను తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు తీసుకొచ్చాడు. తన దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండగా.. పోలీస్ సైరన్ వేసుకుంటూ వచ్చిన కారులోని నలుగురు వ్యక్తులు బాధితుడిని బెదిరించి అతని వద్ద ఉన్న నగదును అపహరించుకుపోయారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.