నలుగురు చిన్నారులను గొడ్డలితో నరికి చంపారు!
అత్యాచారమని పోలీసుల అనుమానం

ముంబయి : ఘోరం.. మహారాష్ట్రలో ఘోరాతి ఘోరమైన సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గిరిజన చిన్నారులను ఆగంతకులు అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘోరమైన ఘటన అక్టోబర్ 15న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని జల్గావ్లో చోటుచేసుకొంది. ఇందులో 13, 6 సంవత్సరాలకు చెందిన బాలికలు, మిగిలిన ఇద్దరూ ఏడాది, 8 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలని పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 15న రాత్రి జరిగినట్లు భావిస్తున్న ఈ హత్యలు..రేవారీ తాలూకాలోని ఓ గ్రామంలోని పొలంలో నిర్మించిన ఇంట్లో జరిగాయి. ఈ విషయాన్ని ఆ ఇంటి యజమాని మరుసటి రోజు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీప బంధువు చనిపోగా.. తల్లిదండ్రులు పెద్ద కుమారుడితో కలిసి అంత్యక్రియలకు వెళుతూ..వారిని తెలిసిన వారికి అప్పగించి వెళ్లారని పోలీసులు తెలిపారు
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ ఈ ఘోర ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇది ఎలా జరిగింది.. ఎవరు చేశారు. దీనికి గల కారణాలు ఏమీ తెలియవు. సాక్ష్యాధారాల కోసం అన్వేషిస్తున్నామని..దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రతాప్ దిగ్గావ్కర్ తెలిపారు. హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ జల్గావ్ను సందర్శించారు. సరైన దిశలోనే దర్యాప్తు జరుగుతుందని..త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని తెలిపారు.
.