ఎపి మంత్రి బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్..

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై తెలంగాణ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విద్యావ్యవస్థపై ఎపి మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో ఎపి మంత్రి ఇలా మాట్లాడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఎపి రాజధాని ఏది అని పరీక్షల్లో అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదని మంత్రి వ్యాఖ్యానించారు. వారి హయాంలో బదిలీల కోసం సూట్‌కేసులతో రెడీగా ఉండేవారని ఆరపించారు. టిఎస్‌పిఎస్‌సి లీకేజి కేసులో దోషులను ఆరెస్టు చేస్తున్నామని.. తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఎపి అభివృద్దిపై దృష్టి పెట్టాలని.. మనుషులు కలిసి మెలిసి ఉండేలా చూడాలని బొత్సకు సూచించారు.
అదేవిధంగా మంత్రి గంగుల కమలాకర్ కూడా బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యున్నత విద్యను అందిస్తున్నామని.. తెలంగాణపై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపిలో ఉపాధ్యాయులు బదిలీలకు రూ. లక్షకు పైగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎపిపిఎస్‌సి సభ్యులే వసూళ్లు చేసి పోస్టులు ఇస్తున్నారన్నారు. బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు..
విజయవాడలో ట్రిపుల్ ఐటి ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఎపి విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని పరిస్థితి తెలంగాణది. మని విధానం మనిది.. మన ఆలోచనలు మనవి మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.