అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల బంగారం స్వాధీనం..
చెన్నై () తమిళనాడులోని పలు ప్రాంతాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని వారిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 12.5 కోట్లు ఉంటుందని సమాచారం. శ్రీలంక నుండి ఫిషింగ్ బోట్‌లో తంగచిమడం (రామనాథపురం) ద్వారా విదేశీ బంగారాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. తంగచిమడం ఉత్తర తీరానికి సమీపంలో నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 5.37 కోట్ల విలువ చేసే 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా డిఆర్ఐ అధికారులు మరో బృందం షార్జా నుండి కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేసి .. వారి వద్ద నుండి 5.17 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు. రూ. 3 కోట్లకుపైనే ఉంటుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఆరుగురు వ్యక్తుల వద్ద నుండి సుమారు 6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 3.8 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 163 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు.. వాటి విలువ రూ. 97 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.