పక్కా ప్రణాళిక.. మీరెలా చేధించారని పోలీసులను అడిగిన నిందితుడు
మచిలీపట్నంలో మహిళా డాక్టర్ హత్య కేసు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/kalayamudu.jpg)
మచిలీపట్నం (CLiC2NEWS): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మహిళా వైద్యురాలు రాధ గత నెలలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు సాంకేతిక ఆధారాలతో చేధించారు. కట్టుకున్న భర్తే.. కాలయముడై, పక్కా ప్రణాళికతో కరుడుగట్టిన హంతకుడికి ఏమాత్రం తీసిపోకుండా భార్యను హత్య చేశాడు. నిందితుడు డాక్టర్ మహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపగా.. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆధారాలు లేకుండా హత్య చేశానని.. మీరెలా చేధించారని దర్యాప్తు అధికారులను ప్రశ్నించాడు. దీంతో నిర్ఘాంతపోవడం పోలసుల వంతైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోక్నాథ మహేశ్వరరావు, రాధ ఇద్దరూ వృత్తిరీత్యా డాక్టర్లు. కింద ఆస్పత్రి, పైన రెండో అంతస్తులో వారు నివాసం ఉంటారు. గత నెల 25న తన ఇంట్లో రాధ హత్యకు గురయ్యారు. మహేశ్వరరావు.. డ్రైవర్ మధు తో కలిసి రాధను హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు వారిని ఆరెస్టు చేశారు. హత్య జరిగిన సమయంలో వారి ఇంట్లో 8 కేజిల బంగారం.. రూ. 50 లక్షల నగదు ఉన్నాయి. వచ్చిన దొంగలు వాటిని ముట్టుకోకుండా కేవలం రాధ వంటిపై ఉన్న నగలు మాత్రమే తీసుకెళ్లడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఘటనా స్థలంలోని సెల్ టవర్ల ఇన్కమింగ్, ఐట్గోయింగ్ కాల్స్‌ను పోలీసులు విశ్లేషించారు. టవర్ విశ్లేషణలో 12 ఫోన్ నెంబర్లలలో ఒకటి డాక్టర్ మహేశ్వరరావుదిగా గుర్తించారు. దాని నుండి హత్య జరిగిన రోజు డ్రైవర్‌కు పదే పదే కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. అంతే కాకుండా నివాసానికి దగ్గర, కిలోమీటరు దూరంలో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. హత్య జరిగిన రోజు వర్షంలో డాక్టర్ స్కూటీపై వెళ్లు సూపర్ మార్కెట్లో కారం ప్యాకెట్ కొనడం.. డ్రైవర్ కదలికలు సైతం కెమెరాల్లో రికార్డయ్యాయి. ముందుగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం రాధ భర్త డాక్టర్ మహేశ్వరరావును అరెస్టు చేశారు.