ఎపి సిఎం జ‌గ‌న్, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిల‌కు ఢిల్లీ న్యాయ‌స్థానం నోటీసులు

 

ఢిల్లీ ఎపి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తీరెడ్డిల‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి ప‌త్రిక కొనుగోలు చేసేందుకు వీలుగా ఎపి స‌ర్కార్ ఇచ్చిన జిఒను స‌వాల్ చేస్తూ ఉషోద‌య ప‌బ్లికేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు జ‌గ‌న్ స‌హా ఆయ‌న స‌తీమ‌ణి భార‌తీ, ఆడిట్ బ్యూరో ఆఫ్ స‌ర్క్యులేష‌న్ కు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ నేతృత్వంలోని ధ‌ర్మాసనం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వాలంటీర్లు, ఇత‌ర ఉద్యోగుల‌కు నెల‌కు రూ. 200 కేటాయిస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం జిఒను జారీ చేసింది. ఈ జిఒను స‌వాల్ చేస్తూ ఉషోద‌య ప‌బ్లికేష‌న్స్ సంస్థ పిటిష‌న్‌ను దాఖ‌లు చేసింది. సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డివై చంద్ర చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాసనం ఈ కేసుల విచార‌ణ‌ను ఎపి నుండి ఢిల్లీ హైకోర్టుకు ఏప్రిల్ 17న బ‌దిలీ చేసింది. ఈ కేసుపై సోమ‌వారం విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం జ‌గ‌న్‌, భార‌తి, ఎబిసికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోపు స‌మాధానం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 22కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.