చంద్ర‌యాన్ -3 ప్ర‌యాణం సాగిందిలా..

 

చంద్రాయాన్‌-3 జాబిల్లిపై స‌క్సెస్‌పుల్‌గా అడుగుపెట్టింది. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల క‌ష్టం.. చంద్రుడిపై భార‌త ప‌తాకం ఎగుర‌వేసింది. నాలుగేళ్ల కింద‌ట‌ చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగం వైఫ‌ల్యం ఇస్రోలో క‌సిని పెంచింది. ఛైర్మ‌న్ శివ‌న్ క‌న్నీళ్లు వృథాగా పోలేదు. అప్ప‌ట్లో ప్ర‌ధాని మోడీ ఛైర్మ‌న్ శివ‌న్‌ను ఓదార్చి.. మ‌రోసారి ప్ర‌య‌త్నిద్ధామ‌న్నారు. చంద్ర‌యాన్‌-2 వైఫ‌ల్యాల నుండి నేర్చుకున్న పాఠాల‌తో చంద్ర‌యాన్ -3 డిజైన్ చేసింది. ఫ‌లితంగా జాబిల్లిపై అడుగుపెట్టి చ‌రిత్ర సృష్టించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీహ‌రికోట నుండి జులై 14న ఇస్రో చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని చేప‌ట్టింది. బాహుబ‌లి రాకెట్ ఎల్‌విఎం3-ఎఒ4 భూక‌క్ష్య‌లోకి విజ‌య‌వంతంగా చేరుకుంది. మ‌రుస‌టి రోజు మొద‌టి సారిగా దీని కక్ష్య‌ను పెంచారు. ఈ విధంగా 18 రోజుల పాటు ద‌శ‌ల వారీగా అయిదుసార్లు క‌క్ష్య‌ను పెంచారు. భూక‌క్ష్య పూర్త‌యిన అనంత‌రం ఆగ‌స్టు 1వ తేదీన జాబిల్లి దిశ‌గా ప్ర‌యాణం కొన‌సాగించే విధంగా లూనార్ క‌క్ష్య‌లోకి ప్ర‌వేశపెట్టారు. త‌ర్వాత ఈ నెల 5వ తేదీన చంద్ర‌డి క‌క్ష్య‌లోకి చంద్రాయ‌న్‌ను చేర్చారు. అనంత‌రం క్ర‌మంగా క‌క్ష్య‌ల‌ను త‌గ్గిస్తూ వ‌స్తూ.. జాబిల్లికి చేరువ చేస్తూ వ‌చ్చారు. ఆగ‌స్టు 17న వ్యోమ‌నౌక‌లోని విక్ర‌మ్ ల్యాండ‌ర్‌.. ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్‌తో కూడిన ‘ల్యాండ‌ర్ మాడ్యూల్‌’ ప్రొప‌ల్ష‌న్ మాడ్యూల్ నుండి విడిపోయింది. ఇది స్వ‌తంత్రంగా చంద్రుడి క‌క్ష్య‌లో ప‌రిభ్ర‌మింద‌చింది. అనంత‌రం రెండు సార్లు డి-ఆర్బిట్ ప్ర‌క్రియ‌లు చేప‌ట్టారు. దీంతో ల్యాండ‌ర్ చంద్రుడి ఉప‌రిత‌లానికి చేరువ చేశారు.

నేటి సాయంత్రం ల్యాండ‌ర్ మాడ్యూల్‌.. నిర్దేశించిన ప్రాంతానికి విజ‌య‌వంతంగా చేరుకుంది. ల్యాండింగ్‌కు అనువైన ప్ర‌దేశాన్ని ఎంచుకుని దిగ్విజ‌యంగా చంద‌మామపై అడుగుపెట్టింది.

రోవ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చే త‌రుణం మిగిలుంది. ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్‌కు ఆరు చ‌క్రాలు ఉంటాయి. ఇందులో కుడివైపు ఉన్న చ‌క్రాలకు ఇస్రో లోగో.. ఎడ‌మ వైపు ఉన్న చ‌క్రాల‌కు జాతీయ చిహ్నం ఉన్నాయి. రోవ‌ర్ .. ల్యాండ‌ర్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఇస్రో సాధించిన ఘ‌న‌త‌కు గుర్తుగా ఈ లోగోల‌ను చంద్రునిపై ముద్రించ‌నుంది. ఇది 14 రోజుల పాటు జాబిల్లి ఉప‌రిత‌లంపై ప‌రిశోధ‌న చేయ‌నుంది. చంద్రుడిపై ఉన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, ఉప‌రిత‌ల నిర్మాణం వంటి అంశాల‌ను ప‌రిశీలించి ల్యాండ‌ర్‌కు క‌మ్యూనికేట్ చేస్తుంది. అంతేకాకుండా మ‌ట్టి, రాళ్లలో ఉన్న ర‌సాయ‌నాల‌ను గుర్తించి స‌మాచారాన్ఇన విశ్లేషిస్తుంది.

చంద్రాయాన్ -2 వైఫ‌ల్యం.. ఈ సారి విక్ర‌మ్ ల్యాండ‌ర్‌కు మ‌రింత అద‌న‌పు సాప్ట్‌వేర్ సామ‌ర్ద్యాన్ని .. త‌గినంత స్వేచ్చ‌నిచ్చారు. చంద్ర‌యాన్ -3లొ అధిక ఇంధ‌నం సమ‌కూర్చారు. ల్యాండింగ్ ప్ర‌దేశంలో ఏమైనా అడ్డంకులు ఎదురైతే.. ప్ర‌త్యామ్నాయ ప్ర‌దేశాల‌ను గుర్తించేవ‌ర‌కు ప్ర‌యాణించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా మ‌రితం శ‌క్తివంత‌మైన కెమెరాను అమ‌ర్చారు. దీనిద్వారా ల్యాండింగ్ ప్ర‌దేశం వేగంగా ఖ‌చ్చితంగా గుర్తిస్తుంది. ఇంకా సూర్యుడికి అభిముఖంగా కాక వేరే దిశ‌లో ల్యాండ్ అయితే.. సోలార్ ప్యాన‌ళ్ల‌కు శ‌క్తి అంద‌నటువంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అద‌న‌పు సోలార్ ప్యాన‌ల్స్‌ను అమ‌ర్చారు.

విక్ర‌మ్ మాడ్యూల్ నుండి రోవ‌ర్ బ‌య‌ట‌కు రావ‌డానికి ముందు ల్యాండ్ అయ్యే ప్ర‌దేశంలో ఉప‌రిత‌లం ఎలా ఉందో చెక్ చేసుకుంటుంది. ఆతర్వాత‌నే వెలుప‌ల‌కు వ‌స్తుంది.

Leave A Reply

Your email address will not be published.