ఇజ్రాయిల్, గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత.. 5 వేల రాకెట్లతో ఇజ్రాయిల్‌పై దాడి..

గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై 5 వేల రాకెట్లు ప్రయోగించారు. పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ గ్రూప్ హమాస్ ఈ దాడులు జరిపినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున కేవలం 20 నిమిషాల వ్వవధిలో వేల రాకెట్లు ప్రయోగించడంతో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయిల్ సేనలు ప్రతిదాడికి దిగాయి.
హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచంలోకి రాకుండా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇపుడు తాజాగా ఇజ్రాయిల్‌పై రాకెట్ దాడులు ప్రయోగించినట్లు వీడియో సందేశం విడుదల చేసినట్లు సమాచారం. ఈ తెల్లవారుజామునే ఆపరేషన్ ఆల్-లక్సా స్ట్రామ్ ప్రారంభమైందని ఇప్పటి వరకు 5వేల రాకెట్లు ప్రయోగించామని అతను పంపిన సందేశంలో ఉన్నట్లు సమాచారం.
సరిహద్దుల్లోని ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని.. ఎవ్వరూ బయటకు రావద్దని ఇజ్రాయిల్ హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లమిక్ జిహాద్ గ్రూప్ ముఠాలు కూడా చేరినట్లు భావిస్తున్నారు. సరిహద్దుల్లో మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయిల్ మీడియా ఆరోపించింది. 35 మందిని సైనికులను కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. ఈ పరిణామాలపై స్పందించిన ఇజ్రాయిల్ రక్షణ మంత్రి.. హమాస్ ఘోర తప్పిదం చేసిందని.. ఈ యుద్ధంలో తామే గెలుస్తామన్నారు.
అరబ్-ఇజ్రాయెల్ మధ్య 1967 జరిగిన యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమించింది. తాజాగా పాలస్తీనా ఆ రెండు ప్రాంతాలను తిరగి పొందేందుకు తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
[…] ఇజ్రాయిల్, గాజా సరిహద్దుల్లో తీవ్… […]