బీహార్‌కు మాత్రమే ఉచిత వ్యాక్సినా?

న్యూఢిల్లీ : బీహార్‌లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. నాయకులు జోరు పెంచారు. వచ్చే వారంలో మొదలు కానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ వ్యూహాల్లో భాగంగా బిజెపి అధిష్టానం మ్యానిఫెస్టో రచించింది. ఈ మ్యానిఫెస్టోలో బీహార్ వ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు అందిస్తామని పేర్కొంది. బీహార్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచితవ్యాక్సిన్ హామి నిప్పు రాజేసింది. ఈ హామీపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రాజకీయ అజెండా కోసం ఇటువంటి హమీలనా ఇచ్చేదీ అని విపక్షాలు మండిపడుతున్నాయి. మ్యానిఫెస్టోను విడుదల చేసే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారీ మొత్తంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే… రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని, మా మానిఫెస్టోలో తొలి వాగ్ధానం అదేనని పేర్కొన్నారు.
ఉచిత వ్యాక్సిన్ హామీపై దేశంలో పలువురు నాయకులు స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ బిజెపియేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటీ? బిజెపికి ఓటు వేయకపోతే..వారికి ఉచిత వ్యాక్సిన్ అందదా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ఈ హామీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. ఈ హామీలనివ్వడం సిగ్గుచేటని, సీతారామన్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందా అంటూ ప్రశ్నించారు. ఉచిత వ్యాక్సిన్ హామీని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా తప్పుబట్టారు. బిజెపి తన పార్టీ నిధులతో ఈ వ్యాక్సిన్‌లు అందిస్తుందా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానా నుండి వీటిని అందజేస్తే బీహార్ ప్రజలకే ఉచితంగా అందించి..మిగిలిన ప్రజానీకం నుండి డబ్బులు వసూలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలు వస్తున్నప్పటికీ..తమ చర్యను బిజెపి నేతలు ఎవరికీ ఇష్టం వచ్చినట్లుగా వారు సమర్థించుకుంటున్నారు.
[…] బీహార్‌కు మాత్రమే ఉచిత వ్యాక్సినా? […]