ఎమ్మెల్యే రాజా సింగ్‌పై బిజెపి సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్ (CLiC2NEWS): బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పార్టీ అధిష్టానం సస్పన్షన్ ఎత్తివేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గత సంవత్సరం ఆగస్టు 23వ తేదీన భారతీయ జనతాపార్టీ సస్పెండ్ చేసింది. దాంతోపాటు ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో రాజాసింగ్ వివరణ ఇచ్చారు. ఆ వివరణను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది. కాగా ఈ ఎన్నికల్లో గోషామహల్ నుంచే రాజాసింగ్ పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.
కాగా భారతీయ జనతాపార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులను వెల్లడించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో పోటీ చేయాడానికి ఆయనకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్లే.