మోడీ ఎప్పుడూ అబద్దాలే చెబుతారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

పాట్నా: బీహార్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాజకీయ నాయకులు ప్రచార జోరు పెంచారు. మహా కూటమి నుండి రాహుల్ గాంధీ, ఎన్డియే కూటమి నుండి ప్రధాని మోడీ ఒక్కసారే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో బీహార్ లో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్… కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గాల్వాన్ సరిహద్దుల్లో దేశం కోసం తలెత్తిన ఘర్షణల్లో బీహార్ చెందిన జవాన్లు అమరులయ్యారని..అదేవిధంగా పుల్వామలో కూడా అమరులైన సైనికులకు నమస్కారం అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించడంపై రాహుల్ కౌంటర్ ఇచ్చారు. భారత భూభాగంలోకి చైనా దళాలు చొచ్చుకురాలేదని ప్రధాని మోడీ అబద్ధాలు వల్లె వేశారని రాహుల్ విమర్శించారు. ఇలా అబద్ధమాడి భాతర సైన్యాన్ని అవమాన పరిచారని విమర్శించారు. చైనా జవాన్ల చొరబాటును వ్యతిరేకిస్తూ మన జవాన్లు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారని, కానీ అసలు మన భూభాగంలోకి చైనా దళాలు చొరబడలేదని మోడీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మన భూభాగంలోని చైనా దళాలు ఎప్పుడు వెనక్కు వెళతాయో ప్రధాని సెలవివ్వాలంటూ డిమాండ్ చేశారు. కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చి రైతులపై దాడికి దిగిందని, వీటి ద్వారా రాష్ట్రంలోని మార్కెట్ యార్డులకు, కనీస మద్దతు ధర తీవ్రంగా దెబ్బతిందని ఆయన ఆరోపించారు. మోడీ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే చెబుతారని, రైతులకు, జవాన్లకు, కార్మికులకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానంటూనే.. ఇక్కడి నుండి ఢిల్లీకి వెళ్లాక ఆదానీ, అంబానీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారని రాహుల్ ఎద్దేవా చేశారు.