NIA: మానవ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న 44 మంది అరెస్టు
ఢిల్లీ (CLiC2NEWS): మానవ అక్రమ రవాణాకు సంబంధించి దేశంలోని 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం సోదాలు నిర్వహించింది. అస్సాం పోలీస్ విభాగానికి చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సెప్టెంబర్ 9న తొలి కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరిన్ని విషయాలు వెలుగులోకి రావడంతో ఎన్ ఐ ఎ పలు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. మానవ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న 44 మందిని అరెస్టు చేసింది.
బంగ్లాదేశ్ సరిహద్దు గుండా భారత్‌లోకి వలస దారులకు ప్రవేశం కల్పిస్తూ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలను విచ్చిన్నం చేయడమే అక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్ ఐ ఎ ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించి గువాహటి, చెన్నై, బెంగళూరు, జైపుర్‌లోని ఎన్ ఐ ఎ విభాగాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం 55 ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించినట్లు సమాచారం. నిందితుల వద్ద నుండి మొబైల్ ఫోన్‌లు, సిమ్ కార్డ్‌లు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 లక్షల కరెన్సీ నోట్లు, 4550 డాలర్లును కూడా సీజ్ చేశారు. వారి వద్ద ఆధార్, పాన్ సహా పలు నకిలీ గుర్తింపు పత్రాలు ఉన్నట్లు గుర్తించారు.