సొంత సోదరులు, తండ్రి చేతిలో దారుణంగా హత్యకు గురైన యువతి
ఖమ్మం (CLiC2NEWS): ఆస్తి కోసం అనుబంధాలను మరిచిపోతున్నారు మనుషులు. ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ పడటం, తన్నుకోవడం, చంపుకోవడం చూస్తూ ఉన్నాం. కానీ కన్న తండ్రి కూడా కొడుకులతో కలిసి తన కూతురినే పైనే దాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా లోని వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
తాటిపూటి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె ఉషశ్రీ మంగమ్మ తండ్రి అయిన మన్యం వెంకయ్య దగ్గరే పెరిగింది. ఆమెను తాతఅమ్మమ్మలే పెద్దచేసి, పెళ్లి చేశారు. వివాహ సమయంలో ఆమెకు గ్రామంలోని ఇల్లు, స్థలం ఇచ్చారు. వెంకయ్య మృతి చెందిన అనంతరం మనవరాలికి ఎక్కువ ఆస్తి ఇచ్చాడంటూ ఉషశ్రీపై సోదరులు కక్ష సాధింపు పనులు చేస్తున్నారు. ఆమె తండ్రితో సహా సోదరులు కోర్టుకు వెళ్లారు. గత కొన్నేళ్లుగా ఆస్థి తమకే రావాలంటూ పోరాటం చేస్తున్నారు.
ఉషశ్రీ నివసిస్తున్న ఇంటి ఆవరణలో ఉన్న సుబాబుల్ చెట్లు నరికే క్రమంలో ఆభూమి మాదే అంటూ పుట్టింటి వారకి మధ్య శుక్రవారం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో గొడవ పెద్దదై ఉషశ్రీ, ఆమె భర్తపై కొడవళ్లతో దాడికి యత్నించారు. ఉషశ్రీ భర్త దాడిలో గాయపడి కుప్పకూలిపోయాడు. పారిపోతున్న ఉషశ్రీని వెంటాడి మరీ సోదరులు దాడి చేశారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉషశ్రీ అప్పటికి నెలల గర్భిణి అని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.