రైలులో అగ్నిప్రమాదం.. కిందకు దూకేసిన ప్రయాణికులు!
ఢిల్లీ (CLiC2NEWS): న్యూఢిల్లీ – దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎగసి పడుతున్నాయి. పలు బోగీల్లోని ప్రయాణికులు భయాందోళనకు గురై రైలు నుండి కిందకు దూకేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ నుండి బిహార్‌లోని దర్భంగా వైపు వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని స్లీపర్ కోచ్‌లో పొగలు వ్యాపించాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా వద్ద సరాయ్ భూపట్ స్టేషన్ దాటుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్టేషన్ మాస్టర్.. సిబ్బందిని అప్రమత్తం చేశాడు. కోచ్ నుండి ప్రయాణికులను ఖాళీ చేయించాడు. మంటలు అధికమవడంతో ప్రయాణికులు భయంతో కిందకు దూకేశారు. రైలులోని మొత్తం మూడు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అలుముకున్నట్లు సమాచారం.