హమాస్‌తో ఇజ్రాయెల్ ఒప్పందం.. 50 మంది బందీలకు విముక్తి..!
జెరూసలెం (CLiC2NEWS): ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యాయి. 50 మంది బందీల విడుదలకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో బాగంగా ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పులు విరమణ పాటిస్తుంది. అదే సమయంలో హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 240 మందిలో కనీసం 50 మందిని విడిచిపెట్టాలని తెలిపింది. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులను వదిలిపెట్టనున్నట్లు సమాచారం.
బందీలను సురక్షితంగా తీసుకురావడమే మా లక్ష్యం.. దీనికోసం నాలుగు రోజులు తాత్కాలిక కాల్పుల విరమణ చేపట్టేందుకు హమాస్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది. అయితే కాల్పుల విరమణ ఎపుడు మొదలవుతుందనే విషయం రానున్న 24 గంటల్లో ప్రకటన వెలువడుతుందని సమాచారం.
హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి చేసి స్థానిక పౌరులను బందీలుగా తీసుకుపోయారు. వారిని నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ సైన్యాలు ప్రతి దాడికి దిగాయి. గాజాకు విద్యుత్, ఇంధన సరఫరా నిలిపివేసి.. అష్టదిగ్భందనం చేసింది. బందీలను విడుదల చేస్తేనే వారికి నీరు. ఔషధాలు సరఫరా చేస్తామని తెలిపింది. దాదాపు ఆరు వారాలనుండి హమాస్- ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. అనేక మంది సైనికులు, సామన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు గాజా యుద్ధంలో 12,700 మంది మరణించినట్లు సమాచారం.
పాలస్తీనా – ఇజ్రాయెల్ అంశంపై బ్రిక్స్ అసాధారణ శిఖరాగ్ర సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ప్రకటించినా.. గాజాలో అమాయకులు బలికావడాన్ని భారత్ వ్యతిరేకిస్తుందన్నారు. గాజాలో ప్రజల్ని ఆదుకొనేందుకు భారత్ తరపున సాయం కొనసాగుతుందని తెలిపారు.చర్చల ద్వారానే ఘర్షణల్ని పరిష్కరించుకోవాలని తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ ఎపుడూ దానికి వ్యతిరేకమని తెలిపింది. గాజాలో మానవతా సాయం కోసం తాత్కాలికి యుద్ధ విరామాలకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలను ఐరాసలో భారత్ స్వాగతించింది. గాజాలోని పాలస్తీనీయుల కోసం భారత్ 25 లక్షల అమెరికా డాలర్ల సాయాన్ని ఐక్కరాజ్య సమితి ఏజెన్సీ యుఎన్ఆర్డబ్ల్యూఎకు అందించింది. ఈ క్లిష్ట సమయంలో సాయాన్ని అందించినందుకు యుఎన్ఆర్డబ్ల్యూఎ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది.