కంచే చేను మేసినట్లుగా.. బ్యాంకులో కుదవబెట్టిన బంగారం మాయం..

శ్రీకాకుళం (CLiC2NEWS): ఇంట్లో కొంత బంగారం ఉంటే.. డబ్బు సమయానికి అందకపోయినా అవసరానికి పనికొస్తదిలే అనుకుంటాం. బంగారం కుదవ బెట్టి పిల్లల ఫీజులు కట్టడమో, పంటలకు విత్తనాలు కొనడమో, బాకీలు జమేయటమో చేస్తుంటాం. తెలిసినవారని, అప్పుఇస్తారనుకొని ఎవ్వరివద్దనైనా బంగారం తాకట్టుపెట్టి డబ్బులు తీసుకోవాలనుకుంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తారు. బ్యాంకుల్లో తనఖాపెడితే మన బంగారం ఎక్కడికి పోదనే నమ్మకం.. పైగా తక్కువ వడ్డీకి పైసలు తెచ్చకుని తమ అవసరాలు తీర్చుకుంటారు. అలా పేదవారు రైతులు, దినసరి కూలీలు.. నమ్మకంతో బ్యాంకుల్లో పెట్టిన బంగారం మాయమైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం, స్టేట్ బ్యాంకు గార శాఖలో సుమారు ఏడు కిలోల బంగారం పోయిందని బ్యాంకు అధికారులు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకులో పనిచేసే ఉద్యోగులా.. బయటివారా అన్నవిషయం తెలియలేదు. ఖాతాదారులు బంగారం గల్లంతుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై తమకు సమాధానం చెప్పాలని.. తమకు భరోసానివ్వాలని స్టేషన్లోనే బ్యాంకు శాఖ మేనేజర్ రాధాకృష్ణతో మాట్లాడారు. ఎటువంటి సమాధానం రాకుంటే.. బ్యాంకుకు తాళం వేసి కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ సిహెచ్ రాధాకృష్ణ స్పందిస్తూ.. ఖాతాదారులు అప్పగించిన బంగారానికి బ్యాంకే బాధ్యత వహిస్తుందని, ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. కొద్దిరోజుల్లో అన్ని విషయాలు తెలియజేస్తామని, అందుకు సహకరించాలని ఖాతాదారులను కోరారు.
ఇటీవల ఓ బ్యాంకు లాకర్లో మహిళ నగదును ఉంచగా..అవి చెదలుపట్టి నోట్లన్నీ పాడైపోయిన ఘటన వెలుగుచూసింది. మరో బ్యాంకులో సదరు బ్యాంకు ఉద్యోగి నగలు తూకం వేసే అతనితో కలిసి వన్‌గ్రామ్ గోల్డ్ నగలు.. బంగారు నగలేనన్నట్లు నమ్మించి, బ్యాంకు ఖాతా దారుడి చేత కుదవ పెట్టించి, వాటికి రుణం పొందిన ఘటనకూడా వెలుగులోకి వచ్చింది.