వాగు దాటుతుండగా ముగ్గురు వ్యక్తులు గల్లంతు..

అరకు (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు అన్నిటిలోకి వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు కష్టంగా మారింది. ఆరకులోయ -విశాఖ ఘాట్‌రోడ్‌లో ముందు జాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అనంతగిరి మండలంలోని లువ్వా వాగు దాటుతుండగా ఓ మహిళతో సహా ముగ్గురు గల్లంతయినట్లు సమాచారం. అధికారులు గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
మిచౌంగ్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎపిలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. ఇక నదులు, వాగులు, పొంగిపొర్లుతున్నాయి. బొర్రాగుహల వద్ద రహదాఇపై కొండ చరియలు విరిగిపడిపోయాయి. కిరండోల్-కొత్తవలస రైలు మార్గంలో అక్కడక్కడ కూడా కొండ చరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాల ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొన్ని చోట్ల సబ్‌స్టేషన్లు సైతం నీట మునిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. పునరావాసాలలో తలదాచుకుంటున్న వారు రెండు రోజులు నుండి చీకట్లలోనే ఉంటున్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో 1,119 గ్రామాల పరిధిలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సంస్థలకు సుమారు రూ. 14 కోట్ల నష్టం వాటినట్లు సమాచారం.