ఇంటికోసం స్నేహితుని కుంటుంబంలోని ఆరుగురి హత్య!
స్నేహితుడే కాలయముడయ్యాడు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
నిజామాబాద్ (CLiC2NEWS): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వారం రోజుల వ్యవధిలో హత్యకు గురయ్యారు. ఆ కుటుంబ యజమాని స్నేహితుడే ఈ హత్యలకు కారణమని పోలీసులు తెలుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా, మాట్లూరుకు చెందిన ప్రసాద్, ప్రశాంత్ స్నేహితులు. ప్రసాద్‌కు భార్య, అమ్మ, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వివిధ కారణాల చేత అప్పులపాలైన ప్రసాద్‌కు బ్యాంకులో రుణం ఇప్పిస్తానంటూ ప్రశాంత్ .. లోన్ ప్రాసెస్ సులువుగా ఉంటుందని, ప్రసాద్ ఇంటిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా బ్యాంకులో రుణం రాకపోవడంతో ప్రసాద్ ఇంటిని తిరిగి తన పేరుమీద రాయాలని ప్రశాంత్‌పై ఒత్తిడితెచ్చాడు. దీంతో ఎలాగైనా ఇంటిని దక్కించుకోవాలని ప్రశాంత్.. స్నేహితుడి కుటుంబంలోని ఆరుగురిని ఒక్కొక్కరిగా హత్యచేశాడు.
ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే హత్యలు తనే చేసినట్లు అంగీకరించాడు. ముందుగా ప్రాశాంత్.. ప్రసాద్‌ను తనవెంట తీసుకెళ్లి డిచ్‌పల్లి జాతీయ రాహదారి పక్కన హత్యచేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తర్వాత ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారని అతని భార్యకు చెప్పి, ఆమెను కూడా తనవెంట తీసుకెళ్లాడు. బాసరలోని గోదావరి నదివైపు ఆమెను తీసుకెళ్లి హత్యచేసి నదిలోపడేశాడు. ప్రసాద్,అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రాసద్ చెల్లిని సైతం నమ్మించాడు. ఆమెను హత్య చేసి మృతదేహం కూడా కనిపించకుండా చేశాడు. ప్రసాద్ తల్లికి మాయమాటలు చెప్పి.. అతడి పిల్లలను నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లోని సోన్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి హతమార్చాడు. అందులోని ఒక మృతదేహం ఈ నెల 8వ తేదీన లభించింది. సోమవారం మరో మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ప్రసాద్ కుటుంబం అంతా పోలీసుల అదుపులో ఉన్నారని మరోచెల్లిని నమ్మించి .. తనతో తీసుకెళ్లి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లిలో నిప్పంటించి చంపేశాడు. ప్రశాంత్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రశాంత్‌తోపాటు అతనికి సహకరించిన వారిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.