మాజి ప్రియుడిని జైలుకు పంపించాలని యువతి స్కెచ్..

హైదరాబాద్ (CLiC2NEWS): మాజి ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకుంది ఓయువతి. ఆ ప్రకారమే పక్కాగా ప్లాన్ వేసింది. చివరికి పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్ నరగర్‌లో నివాసముంటున్న రింకీ, సరూర్ నగర్‌కు చెందిన శ్రవణ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత శ్రవణ్ ఆమెను దూరం పెట్టాడు. దీంతో ఆ యువతి అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఓ పథకం వేసింది.
రింకీ తన స్నేహితులతో కలిసి మంగళ్‌హాట్లో 40 గ్రాముల గంజాయి కొనగోలు చేసింది. దానిని 8 గ్రాముల చొప్పున ఐదు పాకెట్లగా తయారు చేసింది. తన స్నేహితులతో శ్రవణ్‌కు ఫోన్‌చేయించి.. అమీర్‌పేట సమీపంలోని ఓ పార్క్ వద్దకు రప్పించింది. అనంతరం వారందరూ కలిసి జూబ్లిహిల్స్‌లోని పబ్‌కు వెళ్లారు. అందరూ పబ్ లోపల ఉండగా రింకీ.. తనకు తెలిసిన ఒక కానిస్టేబుల్‌కి ఫోన్ చేసి, శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని చెప్పింది. కారులో గంజాయి పాకెట్లు ఉన్నాయని తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోని గంజాయిని స్వాధీనం చేసుకుని.. శ్రవణ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. కారు నాది కాదు.. వేరే వాళ్ల కారులో వచ్చానని పోలీసులకు సమాధానమిచ్చాడు. దీంతో కారులో వచ్చిన వారందరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించాగా.. అసలు విషయం బయటపడింది. రింకీని ఆమెకు సహకరించిన స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు.