ప్రాజెక్ట‌ను పుర్తిగా కొట్టుకుపోవాల‌ని చూస్తున్నారు :కెటిఆర్‌

హైదరాబాద్ (CLiC2NEWS): మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బిఆర్ ఎస్ నేతలు తరలివెళ్లారు. తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు ఆయన మాట్లాడారు. ‘తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేయాల‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా కేసీఆర్ నిర్మించారని కొనియాడారు. రాష్ట్రంలో కరవు లేకుండా చేసేందుకే కాళేశ్వరం నిర్మించారని తెలిపారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగినట్లు.. లేనిది ఉన్నట్టు చూపుతోంద‌ని.. కాళేశ్వరం ప్రాజెక్టును జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నార‌న్నారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి. మేడిగడ్డ ఆనకట్టలోని 84 పిల్లర్లలో 3 మాత్రమే కుంగాయి. లోపాలను సవరించాలి కానీ.. రాజకీయం చేయొద్దు. రాజకీయం చేసేందుకు మేడిగడ్డను వాడుకుంటున్నారు’ అని పోచారం విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.