కవిత్వం అంటే..!
కవిత్వం అంటే…
జనజయగీతిక
కవిత్వం అంటే
రాజాశ్రయాల్లో
కర్ణపేయమైన కైవార
రస డోలికల్లో ఊగే
పదబంధాలు కావు
కవి పలుకుల శృంగార
రస బంధుర ప్రబంధ
సాహితీప్రక్రియ కాదు
సాంప్రదాయ శైలిలో
సుదీర్ఘ సమాసాల వడిలో
ఛందస్సుల పరిష్వoగంలో
బంధింప బడిన
జఠిల పదవిన్యాసం కాదు
పండితులను సైతం
నిఘంటువులు వెదికే
పద పుష్టి కలం సృష్టి కానే కాదు
అది సామాన్యుని
నిత్య జీవనగతిలో
అనుభవిస్తున్న ఖేదాన్ని
పెల్లుబికే క్రోదాన్ని
నినదించే గొంతుకై
సామాన్యుని సహజాత
సారస్వతం కావాలి
సమాజ వికాసానికి
ఉపకరణంగా, ఉత్ప్రేరకంగా
మానవ కళ్యాణనికి
ఊత మిచ్చి భుజం తట్టే
స్ఫూర్తి భావన నిండాలి
కర్షక కార్మిక కండ పుష్టిలో
కార్చే స్వేదం, కాగే రుధిరం
విలువను పెంచి
చరిత్ర పుటలో నిలిపి
నిత్య సమర్చనంగా
శ్లాఘిస్తూ ఘోషిస్తూ
అక్షర వాక్యం కావాలి
పామరుని సైతంకదిలించి
నడిపించే మార్గదర్శియై
సార్వజనీయమై సార్వత్రికమై
బాధ్యతనిండినస్వేచ్చా గళమై
నవ కవితా శీర్షిక రావాలి
జగతికి జనగీతికగా నిలవాలి.
( అంతర్జాతీయ కవితా దినోత్సవ సందర్బంగా )
-శ్రీనివాసాచార్య శేషం
(Rtd GHM. కరీంనగర్)
మరిన్ని కవితల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి: