మ‌ర్రిచెట్టు తొర్ర‌లో రూ. 64 ల‌క్ష‌లు..

ఒంగోలు (CLiC2NEWS): ఎటిఎంలో నింపే న‌గ‌దును చోరీ చేసిన వ్య‌క్తి మ‌ర్రిచెట్టు తొర్ర‌లో దాచిపెట్టాడు. ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ఎటిఎంలో న‌గ‌దు నింపే సిఎంఎస్ వాహ‌నంలో రూ. 68 ల‌క్ష‌లు ఉండ‌గా రూ. 64 ల‌క్ష‌లు చోరీకి గురైన‌ట్లు సిఎంఎస్ సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే నిందితుడిని ప‌ట్టుకొని మొత్తం సొమ్మ‌ను స్వాధీనం చేసుకున్నారు. సిసి కెమెరాల పుటేజిల ఆధారంగా నిందితుడిని గంట‌ల వ్య‌వ‌ధిలోనే గుర్తించారు. నిందితుడు గ‌తంలో సిఎంఎస్ సంస్థ‌లో ప‌నిచేసిన మ‌హేష్‌గా గుర్తించారు. అత‌డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. త‌న ఇంటికి సమీపంలో ఉన్న మ‌ర్రిచెట్టు తొర్ర‌లో న‌గ‌దును దాచిన‌ట్లు చెప్పాడు.

సిఎంఎస్ సెక్యూరిటి సంస్థ సిబ్బంది వివిధ ఎటిఎంల‌లో న‌గ‌దు నింప‌డానికి గురువారం మ‌ధ్యాహ్నం రూ. 68 ల‌క్ష‌లు తీసుకుని బ‌య‌లు దేరారు. ఒంగోలులోని క‌ర్నూలు రోడ్డులో ఉన్న ఇండియ‌న్ పెట్రోల్ బంకు వ‌ద్ద త‌మ వాహ‌నాన్ని నిలిపి, బంకు గ‌దిలోకి వెళ్లి భోజ‌నం చేసి వ‌చ్చి చూసేస‌రికి వాహ‌నం త‌లుపులు తెరిచి ఉన్నాయి. దానిలో కేవ‌లం రూ. 100 నోట్ల క‌ట్ట‌లు మాత్ర‌మే మిగిలున్నాయి. తాము తెచ్చిన రూ. 68 ల‌క్ష‌లలో రూ. 64 ల‌క్ష‌లు చోరీకి గురైన‌ట్లు గుర్తించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.