త‌క్కువ ధ‌ర‌కే బంగారమంటూ.. రూ. 6 కోట్ల మేర వ‌సూలు

హైద‌రాబాద్‌  (CLiC2NEWS): బంగారం ధ‌ర రోజురోజుకీ గ‌రిష్ట స్థాయికి పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో బంగారం త‌క్కువ ధ‌ర‌కే ఇప్పిస్తాన‌ని చెప్పి.. ఏకంగా రూ. 6.12 కోట్లు వ‌సూలు చేశాడు ఓ ఐటి ఉద్యోగి. మొత్తం 13 మంది ద‌గ్గ‌ర నుండి న‌గ‌దు వ‌సూలుచేసి ఉడాయించిన వ్య‌క్తిని సైబ‌రాబాద్ ఇఒడ‌బ్ల్యు (ఆర్ధిక నేరాల విభాగం) పోలీసులు ప‌ట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం..
ఎపిలోని తిరుప‌తికి చెందిన గంటా శ్రీ‌ధ‌ర్ .. మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. కొండాపూర్ మసీదు బండ‌లో కుంటుంబంతో నివ‌సిస్తున్నాడు. కుటుంబికుల‌తో పాటు స‌హోద్యోగులు, కొంప‌ల్లిలోని ఓ వ్యాపారితో ప‌రిచ‌యం పెంచుకున్నాడు.

త‌న‌కు తెలిసిన వ్య‌క్తులు మార్కెట్ ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కే బంగారం కొనుగోలు చేస్తార‌ని.. అంద‌రూ పెట్టుబ‌డుల‌కు ముందుకు రావాల‌ని చెప్పేవాడు. డబ్బు చెల్లించిన కొద్ది రోజుల త‌ర్వాత బంగారం డెలివ‌రీ అవుతుంద‌ని న‌మ్మించాడు. కొంప‌ల్లి వ్యాపారి నుండి రూ. 1.48 కోట్లు బ‌దిలీ చేయించుకున్నాడు. మ‌రో 12 మంది నుండి మొత్తం రూ. 6.12 కోట్లు వ‌సూలు చేశాడు. సికింద్రాబాద్‌లోని రెండు బంగారం దుకాణాల పేరుతో డ‌బ్బులు బ‌దిలీ చేయించుకున్నాడు. వీరంద‌రికి మార్చి 22న బంగారం డెలివ‌రీ చేస్తాన‌ని చెప్పి.. తిరుప‌తిలో ప‌ని ఉంద‌ని, మార్చి 5వ తేదీన భార్య పిల్ల‌ల‌తో కలిసి వెళ్లాడు. అప్ప‌టి నుండి ఫోన్ స్పంద‌న లేదు. అనుమానంతో బాధితులు ఆరా తీయ‌గా .. అత‌ను ఉన్న ప్లాట్ ఖాళీ చేశాడ‌ని, తాము మోస‌పోయామ‌ని గ్ర‌హించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సైబ‌రాబాద్ ఇఒడ‌బ్ల్యు పోలీసులు నిందితుడిని తిరుప‌తిలో అదుపులోకి తీసుకున్నారు. అత‌నిని న‌గ‌రానికి తీసుకువ‌చ్చి.. రిమాండ్‌కు త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.