పోషకాల ఘని పొద్దు తిరుగుడు విత్తనాలు..
మనం పొద్దుతిరుగుడు గింజల నుండి తీసిన వంట నూనెను రోజూ వినియోగిస్తుంటాం. ఈ విత్తనాలు శరీరంలో ఇమ్యూనిటిని పెంచేందుకు ఇన్ఫెక్షన్ను త్వరగా తగ్గించేందుకు దోహదం చేస్తాయి . శరీరానికి తగిన పోషకాలు అందక నీరసంగా.. అలసటగా ఉండటాన్ని నిరోధిస్తుంది. వీటిలో ఉండే థయమిన్ (విటమిన్ బి1) ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు పొద్దుతిరుగుడు విత్తనాలు ఉపయోగపడతాయి. ఒక కప్పు పొద్దు తిరుగుడు పలుకులలో 24 మైక్రో గ్రాముల సెలీనియం , 150 మి.గ్రా. మెగ్నీషియం, 0.5 మి.గ్రా పాంటోథెనిక్ ఆమ్లం లభిస్తాయి. ఇవి కండరాలు పట్టేయకుండా అడ్డుకుంటాయి. మిగతావాటితో పొలిస్తే ఈ గింజలలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఇ, ప్లేవనాయిడ్స్ వంటి యాంటి యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ల నివారణకు దోహదం చేస్తాయి. వీటిలో ఉండే లినోలిక్ ఆమ్లం క్యాన్సర్ నిరోధక కొవ్వు ఆమ్లంగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో కనుగొన్నారు. ఇవి క్యాన్సర్ నిరోధకంగానే కాకుండా కణ స్థాయిల్లో వాపు ప్రక్రియ తగ్గడానికి తోడ్పడుతుంది.
పొద్దు తిరుగుడు విత్తనాలలో పోషకాలతో పాటు అధిక క్యాలరీలు కూడా ఉంటాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవాలి. ఈ విత్తనాలు తినే టపుడు వీటిపై ఉండే పొరను తొలగించి తినాలి. పావు కప్పు వేయించిన సన్‌ప్లవర్ సీడ్స్ లో 205 క్యాలరీలు లభిస్తాయి. 5.7 గ్రా ప్రోటిన్స్, 18 గ్రాముల క్రొవ్వు, 7 గ్రాముల కార్బోహైడ్రేట్స్ 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.