పెళ్లి వస్త్రాలు కొనడానికి వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

గుత్తి (CLiC2NEWS): ఈనెల 27వ తేదీన పెళ్లి. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడానికి హైదరాబాద్ వెళ్లి.. తిరిగి వస్తున్న క్రమంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురై ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన షేక్ సురోజ్ భాషా వివాహం మే 27 వ తేదీన జరగనుంది. పెళ్లి వస్త్రాలు కొనుగోలు కోసం హైదరాబాద్‌కు వెళ్లి.. తిరగి అనంతపురం వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుండి హైదరాబాద్ వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.