కువైట్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న భారతీయులు.. 40 మంది మృతి

Kuwait : కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో 40 మంది మృతి చెందినట్లు సమాచరం. వీరంతా భారతీయులేనని జాతీయమీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆరు అంతస్థుల భవనంలోని కిచెన్‌లో చెలరేగిన మంటలు మొత్తం భవనమంతా వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆ భవనంలో 160 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నవారే. వారిలో 35 మంది సజీవదహనమవ్వగా.. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. జీవనోపాధి కోసం భారత దేశం నుండి ఇక్కడికి వచ్చి.. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.
కువైట్ అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కువైట్‌లో ఉన్న భారత రాయబారి ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారని.. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ఘటనపై కువైట్ అధికారుల నుండి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
కువైట్ అగ్నిప్రమాద ఘటన బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు సహాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి భారత రాయబార కార్యాలయం పనిచేస్తోందని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తుమన్నారు.