విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలు తుక్కుదుకాణానికి..

అచ్చంపేట (CLiC2NEWS):
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలోని విద్యార్థులకు అందించాల్సిన పుస్తకాలు ఓ స్క్రాప్ దుకాణంలో దర్శనమిచ్చాయి. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఉట్ల కోనేరు సమీపంలోని ఓ తుక్కుదుకాణంలో చోటుచేసుకుంది. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 6 నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ పుస్తకాలు సీలు కూడా తీయలేదు. వీటిని గమనించిన కొందరు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమందించారు. ఈ పుస్తకాలు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందాల్సినవిగా గుర్తించారు. 45 కట్టల పుస్తకాలను ఠాణాకు తరలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అభివృద్ధి అధికారి( డిటిడిఒ) కార్యాలయ ఉద్యోగి శంకర్ ఆ పుస్తకాలను విక్రయించినట్లు దుకాణ నిర్వాహకుడు తెలిపినట్లు సమాచారం. దీనిపై డిటిడిఒ ను వివరణ కోరగా విచారణ చేసి నివేదిక ఇస్తామని తెలిపినట్లు సమాచారం.