సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. ఐదుగురు జవాన్లు మృతి
లద్దాఖ్ (CLiC2NEWS): సైనిక విన్యాసాలలో భాగంగా యుద్దట్యాంక్లతో నదిని దాటుతుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించారు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తోంది. లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలోని బోధి నదిలో వరదలు సంభవించాయి. యుద్దట్యాంక్లతో నదిని దాటుతుండగా నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టి-72 ట్యాంక్ మునిగిపోయింది. అందులో ఉన్న ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి నదిలో గాలించారు. ఐదుగురు మృతదేహాలను గుర్తించినట్ఉల అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దాడ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం మన సైనికుల అపార సేవను ఎప్పటికీ మర్చిపోలేమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్లిష్ట పరిస్థితిలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.