జూటా మాటలు వద్దు: హరీష్‌రావు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు జూటా మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపన్యాసాలు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల్లో గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు.. బిజెపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. వెనుకటికి వేయి అబద్దాలు ఆడిన ఒక పెళ్లి చేయాలని అనే వారని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వేయి అబద్దాలు ఆడైన ఒక ఎన్నిక గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలే ఆయుధంగా చేసుకుని, అబద్ధాల పునాదుల మీద దుబ్బాకలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు.
బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తును బహుమతిగా ఇస్తే, బీజేపీ వాళ్ళు 18 శాతం జీఎస్టీని కానుకగా ఇచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే, కేసీఆర్ పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ పథకంలో బీజేపీ ప్రభుత్వ వాటా ఉందని బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రానిది నయా పైసా లేదని స్పష్టం చేశారు. గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్న మంత్రి హరీష్‌రావు గొర్రెల యూనిట్లలో నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు.
‘ఆఖరికి ప్రజలు తినే అన్నం పైన బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రేషన్ బియ్యంపై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. వరి ధాన్యం మద్దతు ధర కోసం రూ. 5,500 కోట్లు కేంద్రం విడుదల చేసిందని పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రజలు చైతన్యవంతులని.. తప్పకుండా వారి ఓట్లతో బిజెపికి బుద్ధి చెబుతారని హరీష్‌రావు అన్నారు.