తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో పది కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఏర్పాటైన ఈ సమావేశంలో సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటి, అధికారులతో మరో కమిటి వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పెండింగ్ విద్యుత్ బిల్లులు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు చెల్లింపులు , విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెకట్లు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు, హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఎపికి కేటాయించే అంశం, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపై సమావేశంలో చర్చించారు.
నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కిరించుకోవాలని.. పెండింగ్ సమస్యల పరిష్కారాలపై చర్చించిన సిఎంలు న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. అదేవిధంగా అధికారుల సూచనలు కూడా తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్న ప్రభాకర్, సిఎస్ శాంతి కుమారి.. ఎపి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బిసి జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేష్ , సిఎస్ నీరబ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.