మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్: డిజిపి
మదనపల్లె (CLiC2NEWS): అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డిఒ కార్యాలయంలో ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో పలు కీలక దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి హెలికాప్టర్లో వెళ్లాలని డిజిపి ద్వారకా తిరుమల రావుకు ఆదేశాలు జారీ చేశారు.
అగ్నిప్రమాద స్థలంలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 22ఎ భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని.. కీలక సెక్షన్లో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఘటన సమాచారం ఆర్డిఒకు తెలిసింది కానీ, కెలక్టర్కు సమాచారం ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న సిఐ కూడా ఎస్పి, డిఎస్పిలకు సమాచారం అందించకపోవడంపై అనుమానాలకు తావిస్తోందన్నారు. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పారు. కార్యాలయానికి కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయన్నారు. ఈ కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశామని డిజిపి తెలిపారు.
మదనపల్లె ఆర్డిఒ కార్యాలయంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కారణంగా విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామాగ్రి దగ్ధమయ్యాయి. అగ్రిమాపక కేంద్రం పక్కనే ఉండటంతో సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయంలో రాత్రి 12 గంటల వరకు ఉన్నట్లు సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.