నిరూపిస్తే నిముషంలో రాజీనామా చేస్తా : కెసిఆర్
జనగామ : దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని తెలంగాణ సిఎం కెసిఆర్ మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపి పింఛన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తుందని చెబుతున్నారు. ఒక వేళ దాన్ని ఎవడైనా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతాను అని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు.
జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగుతుంది.అక్కడ బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. చేసేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్దాలు మాట్లాడుతున్నారు. మన రాష్ర్టంలో 38 లక్షల 64 వేల 751 మందికి ఒక్కొక్కరికి రూ. 2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ. 200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్లకోసం రూ. 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. కేంద్రం కేవలం రూ. 105 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. కానీ బిజెపి నేతలు రూ. 1600లు కేంద్రమే ఇస్తున్నట్లు, తాను అబద్ధాలు చెబుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని సిఎం మండిపడ్డారు. ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలియాలి. కాగ్ లెక్క తీసి అధికారికంగా విడుదల చేసింది. తాను చెప్పే లెక్కలన్నీ కాగ్ వద్ద ఉన్నాయి. ఒక వేళ తాను చెప్పేది అబద్ధమే అయితే, ఎవడన్న మొగోడు రుజువు చేస్తే తాను ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతాను. ఓట్ల కోసం ఘోరమైన మోసాలు చేస్తున్నారు. హృదయంలో నిజమైన ప్రేమలేదు.. వారికి ఓట్లు మాత్రమే కావాలి. ఈ మధ్యనే కేంద్రం వ్యవసాయ బిల్లు తెచ్చింది. గుండాగిరి చేసి బిల్లును ఆమోదించుకున్నారు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కోటి ఎకరాల్లో వరి పండించే మగోడు తెలంగాణ రాష్ట్రమన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 45 శాతం వరి ధాన్యం ఇస్తే.. ఒక్క తెలంగాణ నుంచే 55 శాతం వచ్చినట్లు ఎఫ్‌సిఐ ప్రకటించిందని సిఎం తెలిపారు.