ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఎపిని ఆదుకోవాలి: ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు
ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక కష్టాల్లో ఉన్నదని, కేంద్రం చేయూత నివ్వాలని టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. మంగళవారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. ఆర్ధిక బిల్లుపై చర్చ సందర్బంగా ఆయన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని లోక్సభ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ధిక కష్టాల నుండి ఎపిని గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిందని.. వాటికి సంబంధించిన ప్రతులను పార్లమెంట్ సభ్యులందరికీ అందజేస్తామన్నారు.
పిఎం మత్స్య సంపద యోజన కింద ఆక్వా రైతులను ప్రోత్సహించాలని కోరారు. దేశంలో ఆక్వా ఎగుమతులు 70% ఎపి నుండే జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆరోగ్య, బీమా పాలసీలపై 18శాతం జిఎస్టిని పూర్తిగా తొలగించాలని, టెక్స్టైల్ రంగాన్ని ఆదుకొనేందుకు పత్తి దిగుమతులపై సుంకాలు తగ్గించాలన్నారు. ఆర్ధిక రంగం నుండి గతంలో చెల్లించాల్సిన పన్నుల విధానాన్ని ఎత్తివేయాలని కోరారు.